అహ్మదాబాద్: గుజరాతీ చిన్నారిపై స్థానికేతరుడు రేప్ చేసిన ఘటనతో గుజరాత్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కేసులో బిహార్ నుంచి వలస వచ్చిన వ్యక్తిని అరెస్ట్ కావడంతో అల్లరిమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. ఈ క్రమంలో బిహార్, యూపీ నుంచి వలసవచ్చిన  కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం గాంధీనగర్ తో పాటు అహ్మదాబాద్, పటన్, సబర్‌కాంతా, మెహసానా ప్రాంతాల్లో వలస దారులను లక్ష్యంగా చేసుకొని వారిపై అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. ఈ రేప్ ఘటనపై కొందరు సోషల్ మీడియాలో కొందరు విద్వేష  పూరిత పోస్టులు చేయడంతో ఈ దాడులు జరుగుతున్నాయి. దీంతో పొట్ట కూటి కోసం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ ప్రాణాలను అరచేత పట్టుకుని తమ  సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే బస్సులు, రైళ్లు  కిటకిటలాడుతున్నాయి.


అహ్మదాబాద్‌కు సమపంలోని సబర్‌కాంతా జిల్లా హిమ్మత్‌నగర్ పట్టణంలో ఇటీవలె ఓ చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానంతో ఓ బిహార్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గుజరాతీ ప్రజల్లో బీహార్ తో  సహా వలసదారులపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వీటికి ఆజ్యం పోస్తూ సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు దర్శనమివ్వసాగాయి. ఈ నేపథ్యంలో ఠాకూర్ సేన అనే సంస్థ బిహార్, యూపీ ప్రజలు వెంటనే గుజరాత్ ను వదిలి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ ప్రాంత  వాసులకు పని ఇవ్వరాదని దుకాణాల యజమానులకు అల్టిమేటం జారీచేసింది. దీంతో వందలాది మంది ప్రజలు ప్రాణ భయంతో తమ సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు.